కలం, తెలంగాణ బ్యూరో: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాండియా కార్యక్రమాల్లో బౌన్సర్ల (Dandiya Bouncers) నియామకంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. హిందూ పండుగల్లో భద్రతా సిబ్బందిగా ఎవరిని నియమించుకోవాలన్నది నిర్వాహకుల నిర్ణయమని, ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఓవైసీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టును ప్రస్తావిస్తూ రాజా సింగ్ (Raja Singh) వీడియో ప్రకటన విడుదల చేశారు. దాండియా ఉత్సవాల్లో ముస్లిం బౌన్సర్ల నియామకాన్ని ప్రశ్నించడం ఎందుకని ఆయన నిలదీశారు. హిందూ పండుగల్లో హిందూ బౌన్సర్లు ఉండాలా, ఇతరులు ఉండాలా అనే విషయంపై ప్రశ్నించే అధికారం ఓవైసీకి లేదని అన్నారు. ఆసక్తి ఉంటే సొంతంగా దాండియా కార్యక్రమం నిర్వహించుకుని, తనకు నచ్చిన వారిని బౌన్సర్లుగా నియమించుకోవచ్చని వ్యాఖ్యానించారు.
నాలుగైదేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాం
దాండియా ఉత్సవాల నిర్వాహకులు హిందూ బౌన్సర్లను నియమించుకోవాలని గత నాలుగైదేళ్లుగా తాము సూచిస్తున్నామని రాజా సింగ్ తెలిపారు. ఈ అంశంపై హిందూ సమాజంలో అవగాహన పెరిగిందని, ప్రస్తుతం అనేక కార్యక్రమాల నిర్వాహకులు హిందూ బౌన్సర్లను నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. హిందూ పండుగల నిర్వహణలో భద్రతా ఏర్పాట్ల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు.
నిర్వాహకులకు రాజా సింగ్ పిలుపు
దాండియా సహా హిందూ కార్యక్రమాల నిర్వాహకులు భద్రతా సిబ్బంది ఎంపిక విషయంలో తమ నిర్ణయాలను తీసుకోవాలని రాజా సింగ్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే హిందూ సంఘాలు కార్యక్రమాలను అడ్డుకునే అవకాశం ఉందంటూ ఆయన హెచ్చరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, కార్యక్రమాలపై హిందూ సంఘాలు నిఘా ఉంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

