డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న పాకిస్థాన్

కలం, స్పోర్ట్స్ : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 3 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు అధికారికంగా తప్పుకుంది. తమ జట్టు ఆటగాళ్లకు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది. పీసీబీ నిర్ణయాన్ని సమర్థిస్తూ, తాము టోర్నీలో పాల్గొనలేకపోతున్నామని పాకిస్థాన్ ఛాంపియన్స్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.ఈ విషయాన్ని సదరు జట్టు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పీసీబీ అధికార పరిధిని, నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పింది. తమ ఆటగాళ్లకు ఈ గ్లోబల్ లీగ్‌లో ఆడే అవకాశం రాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపింది.

అంతకుముందు, పీసీబీ నిర్ణయాన్ని సమీక్షించాలని పాకిస్థాన్ ఛాంపియన్స్ యజమాని కమిల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. బోర్డు అధికారులతో వరుస చర్చలు కూడా జరిపారు. కానీ పీసీబీ తన కఠిన వైఖరినే కొనసాగించింది. గతేడాది వివాదాలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పీసీబీ తెరపైకి తెచ్చింది. ఆ షరతులకు డబ్ల్యూసీఎల్ యాజమాన్యం అంగీకరించలేదు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌తో పాకిస్థాన్ ఆడాల్సిన తొలి మ్యాచ్ ఇప్పటికే వాయిదా పడింది.

ఆ తర్వాత అక్టోబర్ 6న ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో సహా పాకిస్థాన్ ఆటగాళ్ళు దూరంగా ఉన్నారు. ఈ వివాదం వెనుక గతేడాది జరిగిన ఘటనలే కారణం. 2025 డబ్ల్యూసీఎల్ ఎడిషన్‌లో రాజకీయ ఉద్రిక్తతల వల్ల పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. దాంతో గ్రూప్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్ మ్యాచ్ కూడా రద్దయింది.

ఆ తర్వాత పాకిస్థాన్ ఫైనల్‌కు చేరినా, సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది.ఆ ఘటనల అనంతరం పీసీబీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. లీగ్ నిర్వాహకులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ, డబ్ల్యూసీఎల్‌పై నిషేధం విధించింది. ఆ నిర్ణయమే ఇప్పుడు 2026 ఎడిషన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. క్రికెట్ బోర్డులు, లీగ్ యాజమాన్యాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే మాజీ అంతర్జాతీయ దిగ్గజాలు ఆడే ఈ టోర్నీకి పెద్ద విఘాతం కలిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>