కలం, కరీంనగర్ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (Vijaya Ramana Rao) అన్నారు. ఎలిగేడు మండలం రాములపల్లి వద్ద రూ. 200 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మత బేధాలు లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు ఒకే వేదికపై పెద్ద ఎత్తున విద్యాభ్యాసం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో 10 ఏళ్లు పరిపాలన చేసిన అప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ స్కూళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రైవేటు పాఠశాలలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు కార్పొరేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి టీపీఎఫ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ లలో దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే మిడ్ డే మీల్స్ తో పాటు అల్పాహారం కూడా ప్రారంభించినట్లు విజయరమణారావు తెలిపారు.
విద్యార్థులకు మంచి విద్యతో పాటు పౌష్టికారమైన ఆహారం అందించేందుకు రేవంత్ రెడ్డి వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన (Vijaya Ramana Rao) చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ ఎల్ కేజీ చదివే పిల్లలకు 30 వేల నుంచి 40 వేలు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు కూడా నిష్ణాతులై బీఈడీ పట్టాలు పొంది ఉంటారని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యా విధానంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పన ధ్యేయంగా సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

