షమీ రీఎంట్రీపై దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ అంతర్జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశారు. షమీ 2025 తర్వాత నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికీ, దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూనే ఉన్నారు. అయితే, భారత జట్టు ఇప్పటికే ఆయనను దాటి ముందుకు వెళ్ళిందని, ఇకపై వెనక్కి తిరిగి చూసి ప్రయోజనం లేదని కార్తీక్ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత బౌలింగ్ విభాగం ప్రదర్శనపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టు విజయం సాధించినప్పటికీ, బౌలర్లు పడిన ఇబ్బందులు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.

ఈ నేపథ్యంలో షమీని మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, కార్తీక్ మాత్రం దీన్ని వ్యతిరేకించారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ ఇప్పుడు ఇతర యువ పేసర్లపై దృష్టి సారించారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టులో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి నిలకడైన ఆటగాళ్లతో పాటు, గురనూర్ బ్రార్, ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్ వంటి యువ ఆటగాళ్లకు క్రమంగా అవకాశాలు ఇస్తున్నట్లు ఆయన (Dinesh Karthik) గుర్తుచేశారు.

భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తున్న తరుణంలో షమీ రీఎంట్రీ కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి కూడా కార్తీక్ మాట్లాడారు. ప్రపంచ క్రికెట్‌లో కీలకమైన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తప్పుకుంటే, భవిష్యత్తులో వన్డే క్రికెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో రాబోయే రోజుల్లో జట్టు ఎంపికపై మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>