కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పరస్పర ఆరోపణల‌న్నీ నాటకం: త‌మ్మినేని

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న నీచమైన ‘బజారు భాష’ తెలంగాణ రాజకీయాల స్థాయిని దారుణంగా దిగజారుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం (Thammineni Veerabhadram) మండిపడ్డారు. ప్రజల నిజమైన సమస్యలను పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం ఉభయ పార్టీలు భూ ఆక్రమణలు, ఆస్తుల వ్యవహారాలపై పరస్పర ఆరోపణల నాటకానికి తెరతీశాయని విమర్శించారు. సోమవారం ఖమ్మంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

​పాపాలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ సమానమేనని తమ్మినేని ఆరోపించారు. ఒకరిపై ఒకరు కేవలం ఆరోపణలు చేసుకోవడమే తప్ప, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచేందుకు ఎందుకు జంకుతోందో చెప్పాలన్నారు. దేశంలో ఓట్ల కొనుగోలు నుంచి నేడు ఈవీఎంల ద్వారా ఫలితాలు రాబట్టుకునే స్థాయికి ప్రజాస్వామ్యం దిగజారిందని, ప్రశ్నించే వారిని ‘దిమాగీ నక్సల్స్’గా ముద్రిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రానికి దాసోహమన్న ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

​ఐక్య కార్యాచరణ లేకుండా వామపక్షాల ఐక్యత సాధ్యం కాదని, విధానపరమైన తేడాలను సరిచేసుకుంటేనే విలీనానికి మార్గం సుగమమవుతుందని స్పష్టం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన సీపీఎం నాయకుడి హత్యకు బాధ్యులైన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>