కలం, ఖమ్మం బ్యూరో: గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు నెలకు రూ.18,000 వేతన పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరసన (Anganwadi Workers Protest) హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కాలంగా అద్దెలు, గ్యాస్ ఛార్జీలు, ఆరోగ్యలక్ష్మి నిధులు, ఈవెంట్ బిల్లులు విడుదల చేయకపోవడంతో కేంద్రాల నిర్వహణ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో టీచర్లు, హెల్పర్లు నిధులు లేక సొంత డబ్బులు వెచ్చించి కేంద్రాలను నడపలేక తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, రూ.18,000 వేతన పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. అలాగే అంగన్వాడీ సిబ్బందికి దసరా పండుగ సెలవులు మంజూరు చేయడంతో పాటు, పదవీ విరమణ పొందే ఉద్యోగులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరిని వీడి సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, గోనే మణి, రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

