కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా హత్నూర మండలం నస్తిపూర్ శివారులోని దౌల్తాబాద్ సబ్ స్టేషన్ ఎదుట సోమవారం రైతులు ఆందోళన (Farmers Protest) చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు వెల్లడించారు. సమయ పాలన పాటించకుండా నిర్వహిస్తున్న కరెంట్ సరఫరా వల్ల వ్యవసాయ పంపుసెట్లు పాడవుతున్నాయని, పొలాలకు నీళ్లు పారించుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. పంట పొలాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించి, అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలని, పూర్తిస్థాయి సరఫరా పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. తక్షణమే సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

