కలం, కరీంనగర్ : తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న కరీంనగర్ (Karimnagar) ఫిలిం భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక జాతర పోస్టర్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సంఘ సేవకుడు వలస సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే, మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసి జానపద సాంస్కృతిక జాతరకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తెలంగాణ జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న జానపద కళలకు పునరుజ్జీవనం కల్పించడం, కనుమరుగవుతున్న పల్లె వాతావరణం, సహజ జీవనశైలి, సంప్రదాయ కళలను పరిరక్షించడమే జాతర ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని జానపద కళాకారులు, కళా బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాల్గొనే కళాకారులకు ఉచితంగా ప్రదర్శన సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. కళాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి 9440988001 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రమేష్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కర్ర సూర్యశేఖర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రమణరావు, ప్రముఖ జానపద కళాకారుడు గుండేటి రమేష్, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

