కలం, కరీంనగర్ బ్యూరో: పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టి కరీంనగర్ (Karimnagar) పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా సోమవారం 20వ డివిజన్ రేకుర్తి ప్రాంతంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, స్థానిక కార్పొరేటర్లు పర్వతం మల్లేషం, సుధగోని మాధవి కృష్ణ గౌడ్, కాంతాల జగన్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
రేకుర్తిలోని బృందావన్ కాలనీలో నగరపాలక సంస్థకు చెందిన సాధారణ నిధులు రూ. 9.00 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం హనుమాన్ నగర్‌లో రూ. 14 లక్షల సుడా నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రేకుర్తి ప్రాంతంలో పలు కాలనీల్లో పాదయాత్ర చేసి, స్థానికంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి పరిశీలించి, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలను నగరపాలక సంస్థ ద్వారా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆడబిడ్డలు ఆడీ పాడే బతుకమ్మ పండగకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఏర్పాట్లకు కావాల్సిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం చేశామని పేర్కొన్నారు. బతుకమ్మ పాయింట్ల వద్ద ఆడబిడ్డల కోసం కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
19, 20వ డివిజన్ల అభివృద్ధికి రూ. 2 కోట్లు
రేకుర్తి ప్రాంతం గతంలోనే నగరపాలక సంస్థలో విలీనం చెందినప్పటికీ శివారు ప్రాంతం కావడంతో 19, 20వ డివిజన్లలో అనేక సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన కాలనీలు ఉండటం వల్ల ప్రజలు చాలా సమస్యలు మా దృష్ఠికి తెచ్చారని తెలిపారు. పాలకర్గ సభ్యులు, ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు… కౌన్సిల్ సమావేశంలో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ. 2 కోట్లు కేటాయించామని తెలిపారు.
అంతే కాకుండా యూఐడీఎఫ్ నిధుల నుండి కూడ దాదాపు రూ. 70 లక్షలు అభివృద్ధి పనులకు కేటాయించి, వాటిని దశలవారీగా ప్రారంభం చేసి పనులు చేయనున్నట్లు వివరించారు. సంబంధిత రేకుర్తి ప్రాంతంలోని డివిజన్లలో మంచి నీటి సమస్య కూడ ఉండటంతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కూడా రూ. 80 లక్షలు త్రాగు నీటి పైపులైన్ అభివృద్ధి పనులకు కేటాయించామని తెలిపారు.
19, 20వ డివిజన్‌లో అనేక సమస్యలు ఉన్నాయనీ, ప్రధానంగా మురుగు నీటి వరద కాలువ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీంలో ప్రతిపాదనలు ఇప్పటికే సిద్దం చేసి, టెండర్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. త్వరలోనే యూసీఎఫ్ నిధులతో మురుగు నీటి వరద కాలువకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. 66 డివిజన్లను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్ల అభివృద్దే ద్యేయంగా తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

