కలం, యాదగిరిగుట్ట: బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు, నిధులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కులగణన అవసరమని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) అన్నారు. శంషాబాద్ గొల్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ జనాభాలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో తగిన అవకాశాలు దక్కడం లేదన్నారు. బీసీల వాస్తవ జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి కులగణన కీలకమని పేర్కొన్నారు.
తెలంగాణలో బీసీల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అయిలయ్య (Beerla Ilaiah) తెలిపారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు బీసీ యువత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కుల కోసం టీపీసీసీ ఓబీసీ సెల్ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. శంకరయ్య అధ్యక్షతన జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీసీ ప్రజలు పాల్గొన్నారు.

