కలం, జోగుళాంబ గద్వాల : రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యలకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే పూర్తి పరిష్కారాన్ని చూపలేవని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్పీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ మల్లన్న తలపెట్టిన బీసి రాజ్యాధికారం పాదయాత్ర ఆదివారం గద్వాలలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమయ్యారు.
అనేక సంవత్సరాలుగా డిస్ట్రిక్ లైబ్రరీ భవనాన్ని నిర్మిస్తామని పనులు ప్రారంభించి నేటికీ పూర్తి చేయలేకపోయారని విద్యార్థులు.. ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఉన్న లైబ్రరీలో కనీస వసతులు కల్పించడంలేదని, ముఖ్యంగా టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఫోన్ చేసి గ్రంథాలయంలో మౌళిక వసతులు కల్పించాలని కోరారు.
అనంతరం నిరుద్యోగ యువత, పట్టభద్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని వేల లేదా రెండు లక్షల ఉద్యోగ ప్రకటనలు వచ్చినంత మాత్రాన, 36 లక్షల మంది నిరుద్యోగుల అవసరాలను అవి నెరవేర్చలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం పాలనా వ్యవస్థను నడపడానికి రూపొందించిన ఒక ప్రక్రియ మాత్రమే తప్ప, అది పూర్తి జీవితం కాదన్నారు. యువత తమ ఆలోచనలను, శ్రమను వ్యాపార రంగం వైపు మళ్లించాలని సూచించారు. 100మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని, కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార సంస్థలను స్థాపించి ఆర్థిక సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల భవిష్యత్తును మార్చే మార్గదర్శకాలను అందించడానికే తాను ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రజా సమస్యల స్పృహ పెంచి చైతన్యపరచడమే తన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పరిమితులను గుర్తించి, యువత తమ నైపుణ్యాలతో వ్యాపార రంగాన్ని ఎంచుకుని సమాజంలో ఉపాధి ప్రదాతలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గద్వాల నుంచి వీరాపురం మీదుగా ఎర్రవల్లి మండల కేంద్రానికి పాదయాత్రగా కొనసాగించారు.

