కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) డీఎంకే నేతలకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో డీఎంకే కొందరు నాయకులు మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా తనపై ఎలాంటి విమర్శలు చేసినా సహిస్తానని.. మహిళలను అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ధరంపురం నియోజకవర్గంలో టీవీకే పార్టీ అభ్యర్థి సత్యభామ తరఫున సీఎం విజయ్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్‌పై సీఎం విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘స్టాలిన్ ఇక్కడ ప్రచారానికి వచ్చి, మా అభ్యర్థి సత్యభామను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వినడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మహిళల గౌరవానికి భంగం కలిగించవద్దన్న విషయం ఆయనకు తెలియదా..? డీఎంకే పార్టీకి ఓటు వేయడమంటేనే మహిళలను అవమానించేందుకు అనుమతి ఇచ్చినట్లే’ అని ఓటర్లను హెచ్చరించారు.
ఎప్పుడు కలవాలో నాకు తెలుసు..
తాను ఎన్నికలప్పుడే ప్రజలను కలిసే నాయకుడిని కాదు అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ప్రజలు నాకు బంధువులు, వారిని ఎప్పుడు, ఏ సమయంలో కలవాలో తనకు పూర్తిగా తెలుసని.. డీఎంకే నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ధర్మపురం నియోజకవర్గానికి అక్టోబర్ 6వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ సుమారు 40 కిలోమీటర్ల మేర రోడ్ షో చేపట్టారు. టీవీకే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ఓటర్లను కోరారు. ధరంపురంతో పాటు మధురాంతకం నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. టీవీకే ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నికలు ఇవి. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

