ఉమ్మడి వరంగల్‌లో సోలార్ జోరు.. ఉచిత కరెంట్‌తో ఆదాయం!

కలం, వరంగల్ బ్యూరో: సౌర విద్యుత్ వైపు ప్రజలు అడుగులు వేస్తుండగా, ఇళ్ల పైకప్పులే పవర్ హౌస్లుగా మారుతున్నాయి. మరోవైపు పెరిగిపోతోన్నవిద్యుత్ వినియోగ భారం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం (PM Surya Ghar) కింద ఇళ్ల పైకప్పుల మీద సోలార్ ప్లాంట్ల నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

సబ్సిడీతో ప్లాంట్ ఏర్పాటు చేసుకుని సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఆదాయం పొందుతున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 29,621 ఇళ్లలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 11,218 దరఖాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. మరో 20 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

100 మెగావాట్లు దాటిన ఉత్పత్తి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే సౌర విద్యుత్ ఉత్పత్తి 100 మెగావాట్లు దాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 200 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. సౌర విద్యుత్ విస్తరణతో రైతులకు అదనపు ఆదాయం, వినియోగదారులకు పర్యావరణహిత విద్యుత్, సంస్థకు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు.

తగ్గిన బిల్లుల భారం

విద్యుత్ వాడకం పెరగడంతో కరెంట్ బిల్లులు మోత మోగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజలు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారికి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ అవసరాలకు వాడుకుంటుండగా బిల్లుల భారం తగ్గుతుందని ఇళ్ల యజమానులు చెబుతున్నారు. అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించడం ద్వారా ఆదాయం పొందుతున్నామని పేర్కొంటున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తితో పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రూ.78 వేల వరకు సబ్సిడీ

పీఎం సూర్య ఘర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు రెడ్కో అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకూ సోలార్

పేద కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు కూడా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క చెబుతున్నారు. సౌర విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>