కలం, సినిమా: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన సాంగ్ మార్ఫ్డ్ వీడియోపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏఐని ఉపయోగించి ఓ మహిళను అత్యంత అసభ్యకరంగా చూపించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నీచమైన పనులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ వీడియోను సృష్టించిన వారితో పాటు షేర్ చేస్తున్న అందరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు.
మన సంస్కృతిలో మహిళలను తల్లులుగా, దేవతలుగా చూస్తామని, మాతృ దేవోభవ అనే మాట మన జీవన విధానమని ఎన్టీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని, కనీసం లైక్ లేదా కామెంట్ చేయడం లాంటివి కూడా చేయొద్దని కోరారు. ఈరోజు మరొకరికి జరిగిన ఈ అన్యాయం, రేపు మన కుటుంబంలోని మహిళలకు కూడా జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ (Chuttamalle) పాటను కొందరు వ్యక్తులు ఏఐతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వీడియోపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

