కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 22-ఎ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. నాలా (NALA) అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్ల (22A Land Registrations)కు సంబంధించి భూయజమానులకు తీపి కబురు అందించింది. నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.
ఈ క్రమంలో మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 22-ఎ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం పెంచామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు రకాల కీలక ఉత్తర్వులు విడుదల చేశామని చెప్పారు.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుతో పాటు జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న 22-ఎ పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇచ్చామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యూఎల్సీ దరఖాస్తులతో పాటు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయి అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, 22-ఎ ప్రక్రియపై రెవెన్యూ అధికారులు నిరంతరం మానిటరింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

