కలం, వనపర్తి: మహిళా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. శుక్రవారం వనపర్తి మండలానికి చెందిన మహిళా రైతులకు ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఉచిత వేరుశనగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 103 మంది మహిళా రైతులకు 206 క్వింటాళ్ల విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందించడం ద్వారా మహిళా రైతులపై పెట్టుబడి భారం తగ్గుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో మహిళలు మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
మహిళల అభ్యున్నతి కోసం వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే (Megha Reddy) తెలిపారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడంతోపాటు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలకు మహిళలను చైర్‌పర్సన్లుగా అవకాశం కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థుల పాఠశాల దుస్తుల కుట్టుపనులను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా వ్యవసాయం, వ్యాపారం, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవికిరణ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర, ఏవో కురుమయ్య, మహిళా రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

