నిశ్శబ్దంగా నలిగిపోతున్న ‘కరుణామూర్తులు’.. కరీంనగర్‌లో నర్సు ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో: రోగి మంచం పక్కన నిలబడి ఆందోళనను ఉపశమింపజేసే నవ్వులు కంటికి రెప్పలా కాపాడే నిరంతర శ్రమ, అర్థరాత్రి వేళల్లో కూడా ప్రాణాలు నిలిపే సమయస్ఫూర్తి… ఆరోగ్య వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే నర్సుల జీవితాల్లో వెలుగులు తప్ప ప్రశాంతత కరువైపోతోంది. కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రాత్రివేళ విధుల్లో ఉన్న నర్సు ఆత్మహత్యకు (Karimnagar Nurse) పాల్పడిన ఉదంతం కేవలం ఒక వార్త మాత్రమే కాదు. ప్రైవేట్ వైద్య రంగాన్ని ఆవహించిన మానసిక వేధింపులు, పని ఒత్తిడి, భద్రతా లేమికి అద్దం పడుతున్న చేదు నిజం.

తెల్ల కోటు వెనుక నలిగిపోతున్న మానసిక వేదన..

కరీంనగర్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, అక్కడ పనిచేసే దిగువ స్థాయి పారామెడికల్ సిబ్బంది జీవితాల్లో ఎలాంటి మార్పూ రావడం లేదు. అతి తక్కువ వేతనాలు, 12 గంటలకు పైగా సాగే సుదీర్ఘమైన పని షిఫ్టులు, విశ్రాంతి లేని వాతావరణం, యాజమాన్యాల వేధింపులతో నర్సింగ్ సిబ్బంది తీవ్ర మానసిక కృంగుబాటుకు గురవుతున్నారు. ఒక ప్రాణాన్ని కాపాడే క్రమంలో తమ సొంత ప్రాణాలను, మానసిక ఆరోగ్యాలను త్యాగం చేయాల్సి రావడం ఈ వ్యవస్థలోని పెను విషాదం.

రక్షణ లేని రాత్రి షిఫ్టులు.. చట్టాలు పుస్తకాలకే పరిమితమా?

ప్రైవేట్ హాస్పిటల్ రంగాన్ని పరిశీలిస్తే, మహిళా సిబ్బంది భద్రత అనేది తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి షిఫ్టులు చేసే సమయంలో సిబ్బందికి తగిన రక్షణ, విశ్రాంతి గదులు లేదా రవాణా సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act) ప్రకారం ప్రతీ ఆసుపత్రిలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ (ICC) ఉండాలనేది స్పష్టమైన నిబంధన. కానీ, క్షేత్రస్థాయిలో చాలా ఆసుపత్రుల్లో ఈ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే ఉద్యోగం ఊడుతుందనే భయంతో నర్సులు తమ ఆవేదనను గుండెల్లోనే దాచుకోవాల్సి వస్తోంది.

ఏఐవైఫ్ ఆందోళన.. నిలదీత

ఈ దారుణ ఘటనపై ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ స్పందిస్తూ.. ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఆసుపత్రి యాజమాన్యాల ధనదాహం, నిర్లక్ష్యం కలసి చేసిన ‘వ్యవస్థాగత హత్య’ అని ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

డిమాండ్లు ఇలా..

సదరు నర్సు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై డిపార్ట్‌మెంటల్, పోలీస్ విచారణ వేగవంతం చేసి కారణమైన యాజమాన్యం లేదా వ్యక్తులపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలో కారిడార్లు, పార్కింగ్ ప్రాంతాలు, డ్యూటీ రూమ్‌ల వద్ద పరిపూర్ణ భద్రత ఉండేలా జిల్లా వైద్యాధికారి తక్షణమే ఆకస్మిక తనిఖీలు చేపట్టాలంటున్నారు. రాత్రి షిఫ్ట్ ముగించుకునే మహిళా సిబ్బందికి ఉచిత, సురక్షిత రవాణా సౌకర్యాన్ని యాజమాన్యమే కల్పించాలని.. ప్రతీ ఆసుపత్రుల్లో వెంటనే క్రియాశీలకం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మార్పు ఎప్పుడు?

ఒక దారుణం జరిగినప్పుడు మాత్రమే చలించడం, కొన్ని రోజులకు దానిని మర్చిపోవడం పరిపాటిగా మారింది. శ్రమదోపిడీని, మానసిక వేధింపులను అరికట్టేలా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోతే, భద్రత కల్పించని ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేయకపోతే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన జ్వాలలు తగ్గవని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా సమాజ ఆరోగ్యానికి కష్టపడే ‘కరుణామూర్తులకు’ కనీస భద్రత, గౌరవం దక్కాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజంపై ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>