కలం, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. విద్యార్థులు ఆలోచించకుండా, ప్రశ్నించకుండా ఉండేందుకే మోదీ సర్కార్ విద్యను ద్వేషిస్తోందని ఆరోపించారు. దీనికి తాజా నిదర్శనమే ఇదంటూ ఎక్స్ వేదికగా కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన ‘అన్-హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’, జ్యోతీరావు పూలే రచించిన ‘గులామ్‌గిరి’ వంటి ప్రాథమిక గ్రంథాలు యువత మెదళ్లలో విషం నింపుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు అజ్ఞాత వ్యక్తులు పోస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు కేంద్ర విద్యాశాఖ దేశంలోని అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలను వారి సిలబస్ వివరాలు కోరిందన్నారు. ఈ కోర్సుల్లో ఎంతమంది విద్యార్థులు ప్రవేశాలు పొందారనే వివరాలపై ఆరా తీసిందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేపర్ లీకులు, నిరుద్యోగం, యువత భద్రత వంటి కీలకమైన అంశాలపై ప్రధాని మౌనంగా ఉంటున్నారని, కానీ ఇంటర్నెట్ ట్రోల్స్ ఇచ్చే చిన్న సంకేతాలకే ఆయన వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించడం అత్యంత హేయమని విమర్శించారు.

