రెవెన్యూ సేవల్లో జాప్యం వద్దు.. అధికారులకు కలెక్టర్ ప్రియాంక ఆదేశం

కలం, నారాయణ పేట: రెవెన్యూ సేవల్లో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) అధికారులను ఆదేశించారు. నారాయణపేట (Narayanpet) జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయాన్ని (RDO Office ) కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పరిపాలనా కార్యకలాపాలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరవుతున్న తీరును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, భద్రపరిచే విధానం, రికార్డుల అందుబాటు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, అవసరమైన సమయంలో సులభంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పెండింగ్ భూసేకరణ ప్రక్రియపై సమీక్ష

అదేవిధంగా మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించి, సంబంధిత అధికారులు, భూ యజమానులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో రమేష్‌ను ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యాలయానికి సంబంధించిన చారిత్రక, పరిపాలనా వివరాలను ఆమె ఆసక్తిగా పరిశీలించారు. కార్యాలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, ఫైళ్ల పరిష్కారం, భూ సంబంధిత అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>