కలం, జనగామ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
AICC, TPCC పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ (Jangaon Congress Protest) నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నుంచి బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

