కలం, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ భూములు (Government Lands) ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి(Collector Chahat Bajpai) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను గుర్తించి వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలో క్రైస్తవ, ముస్లిం మతస్తుల కోసం స్మశాన వాటికల కేటాయింపునకు ప్రతిపాదించిన స్థలాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు.
స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
మడికొండలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్.. భూమి విస్తీర్ణం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, స్థలానికి సంబంధించిన రికార్డులు తదితర వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మశాన వాటికల కేటాయింపునకు సంబంధించి స్థల పరిశీలన, రికార్డుల పరిశీలనను పూర్తిచేసి, నిబంధనల ప్రకారం అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్డీఓ వెంకటేష్, కాజీపేట తహసీల్దార్ రాజును ఆదేశించారు.
ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించే సమయంలో భూమి స్థితిగతులు, రికార్డులు, స్థల అనుకూలత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
ప్రభుత్వ భూములకు (Government Land) సంబంధించిన ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి చుట్టూ స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అని తెలియజేసే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూముల వివరాలను రెవెన్యూ రికార్డులతో క్షేత్రస్థాయిలో సరిపోల్చి పరిశీలించాలని తెలిపారు.
ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనధికార ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల విషయంలో ఏవైనా సమస్యలు గుర్తించిన వెంటనే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, కాజీపేట తహసీల్దార్ రాజు, రెవెన్యూ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీ చెప్పిందే నిజమైంది: భట్టి విక్రమార్క
Follow Us On: X(Twitter)

