కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక (Khairatabad Bypoll) ఖాయం కావడంతో అక్కడ ఫోకస్ పెట్టిన మూడు ప్రధాన పార్టీలకు ‘సర్’ టెన్షన్ పట్టుకున్నది. ‘సర్’ ముసాయిదా జాబితా(SIR Draft Electoral Roll) తర్వాత ఈ సెగ్మెంట్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. వీరిలో ఎక్కువగా పర్మనెంట్‌గా అడ్రస్ మారినవారే ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) కార్యాలయం గత నెలలో ప్రకటించింది. సర్ ప్రక్రియకు ముందు ఖైరతాబాద్‌లో 2,79,497 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 1,70,195కు తగ్గిపోయింది. మొత్తం 1,23,472 మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ లిస్టు నుంచి డిలీట్ అయ్యాయి.
చనిపోయినవారు, పర్మనెంట్‌గా షిఫ్ట్ అయినవారు, ఆచూకీ లేనివారు (అన్‌ట్రేసబుల్), డూప్లికేట్ (డబుల్ ఎంట్రీ) ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ లిస్టు నుంచి తొలగించాల్సి వచ్చిందని సీఈఓ పేర్కొన్నారు.‘సర్’కు ముందు ఉన్న మొత్తం ఓటర్లలో 42% మంది ఇప్పుడు లేకపోవడంతో.. ఆ ఎఫెక్ట్ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొన్నది. గతంలో అనుకూలంగా ఓటు వేసిన వారిలో ఎందరు ప్రస్తుతం ఉన్నారు? ఎందరు లేరు? అనే వివరాలు తేలితే ఏ పార్టీ ఓటు బ్యాంక్‌పై ఎలాంటి ఎఫెక్టు పడుతుందనేది తేలనున్నది.
తుది జాబితా తర్వాతే కసరత్తు
ప్రస్తుతం ముసాయిదా జాబితాకు అనుగుణంగా వివరాలు సరిగ్గా లేని, తేడాలు ఉన్న ఓటర్లకు సీఈఓ ఆఫీస్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇదంతా ముగిసిన తర్వాత ఓటర్ల తుది జాబితాను సీఈఓ ఆఫీస్ నవంబర్ 9న రిలీజ్ చేయనున్నది. దీంతో ఈ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉంటారనే లెక్క తేలనున్నది.
గతంలోని జాబితా, పోలింగ్ సరళి, పడిన ఓట్లు తదితరాలను అనలైజ్ చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడ వెలితి ఉన్నదో, దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో పార్టీలు ఆలోచిస్తాయి. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలకు అనుగుణంగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. గతంతో పోలిస్తే పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగే అవకాశమున్నది.. దాని నుంచి అధిగమించడం ఎలా.. పార్టీని బలోపేతం చేసుకోవడం, ఏ అభ్యర్థికి ప్రజాదరణ ఎక్కువగా ఉన్నది.. ఇలాంటి అంశాలపై స్టడీ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోనున్నాయి.
మెజారిటీ కంటే ఆరు రెట్లు మిస్సింగ్
గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ 22,010 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ సంఖ్యతో పోలిస్తే ఆరు రెట్లు (1,23,472) ఎక్కువగా ఓటర్లు ఇప్పుడు డిలీట్ అయ్యారు. వీరిలో దాదాపు 45.5% (56,162) మంది మహిళా ఓటర్లే. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా జూబ్లీహిల్స్, మలక్‌పేట, అంబర్‌పేట తర్వాత అత్యధికంగా ఓటర్లు మిస్ అయిన నాల్గో నియోజకవర్గం ఖైరతాబాద్. ఈ నియోజకవర్గంలో యావరేజ్‌గా 21% మంది ముస్లింలు ఉంటారని, డిలీట్ అయిన ఓటర్లలో 25,984 మంది ఆ కమ్యూనిటీకి చెందినవారేనని, మిగిలిన 97,488 మంది నాన్-ముస్లిం కేటగిరీవారు అని కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న సబర్ ఇన్స్టిట్యూట్ తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నది.
వయసుల వారీగా చూస్తే మొత్తం డిలీట్ అయిన 1.23 లక్షల ఓటర్లలో 30-44 ఏజ్ గ్రూపువారు 58 వేల మంది, 45-59 ఏజ్ గ్రూపువారు 31 వేల మంది ఉన్నట్లు తేలింది. సుమారు 14 వేల మంది ఓటర్లు 18-29 ఏజ్ గ్రూపువారని, 60 ఏండ్లకు పైబడినవారు దాదాపు 21 వేల మంది ఉంటారని వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లతో (1,54,924) పోలిస్తే దాదాపు 79.7% మంది ఓటర్ల పేర్లు ఇప్పుడు గల్లంతైనట్లు నివేదిక పేర్కొన్నది.
ఓటర్ల గ్రీవెన్స్‌పై ఫోకస్
ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు మిస్ అయినవారికి, వివరాల్లో తప్పులు ఉన్నవారికి సీఈఓ ఆఫీస్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తగిన ఆధారాలను (డాక్యుమెంట్లు) చూపించి పేర్లను సరిచేయించుకుని ఫైనల్ లిస్టులో ఉండేలా చూసుకోవాలని ఈసీ నుంచి షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రకారం వచ్చే నెల 7వ తేదీ వరకు అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏయే పోలింగ్ బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయో, ఎవరికి నోటీసులు అందాయో స్థానిక పార్టీ నేతల దగ్గర వివరాలు ఉన్నందున.. ఆ ప్రకారం వారి తరఫున తగిన ఎవిడెన్స్‌లను సమర్పించి ఫైనల్ లిస్టులో పేరు ఉండేలా చూస్తున్నారు.
కొత్తగా అర్హత కలిగిన ఓటర్ల పేర్లను కూడా ఫారం-6 ద్వారా చేర్పించడంపై ఫోకస్ పెట్టారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7వ తేదీ వరకు అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే స్థానిక పార్టీ కేడర్ ద్వారా అర్హత కలిగిన ఓటర్లను గుర్తించి వారి దగ్గర ఉన్న ఆధారాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో), బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లకు సమర్పించి తుది జాబితాలో పేరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. డిలీట్ అయిన ఓటర్లలో దాదాపు పాతిక వేల మంది ముస్లింలు కూడా ఉండడంతో మజ్లిస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది.

