కలం, వెబ్ డెస్క్ : కుమార్తెపై ఉన్న ప్రేమను ఓ తండ్రి వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తె జ్ఞాపకాలను శాశ్వతం చేసేందుకు ఆమె కోసం ఏకంగా ఆలయాన్ని నిర్మించారు. నాగర్‌కర్నూల్ జిల్లా చుక్కాయిపల్లి (Chukkayipalli) గ్రామానికి చెందిన రమేష్ తన కూతురికి ఇచ్చిన ఈ భావోద్వేగ నివాళి (Emotional Tribute) స్థానికులను కదిలిస్తోంది. రమేష్ కుమార్తె 13 ఏళ్ల వయసులో 2024లో అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తెను కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేకపోయిన ఆయన.. ఆమె జ్ఞాపకార్థం సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. కూతురి జ్ఞాపకాలను తలచుకుంటూ ప్రతిరోజూ ఆలయంలో దీపారాధన నిర్వహిస్తున్నారు. ఆమెకు నివాళులర్పిస్తూ, తన కుమార్తెతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కూతురిపై తండ్రికి ఉన్న అమితమైన ప్రేమకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తోంది.

