కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామం (Buchireddypalem) సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తీవ్రతకు రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకుప్పుల ప్రేమ్ కుమార్, అలాగే మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రాంబాబుగా పోలీసులు గుర్తించారు.
ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

