కలం, కరీంనగర్: జమ్మికుంట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఉద్యమకారుడు, పద్మశ్రీ కోండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశం (Saini Mallesham) ముఖ్య అతిథిగా విచ్చేసి, బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం..
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. కోండా లక్ష్మణ్ బాపూజీ జీవితం దేశానికి, భావితరాలకు ఎనలేని స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన అడుగుజాడలు ప్రాతఃస్మరణీయమని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని అన్నారు. బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మెగా రక్తదాన శిబిరం..
‘సేవా సంకల్ప అభియాన్’ ప్రోగ్రాంలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం లభిస్తుందని, యువత రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన సందర్భంగా నెల రోజులపాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తదనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ప్రధాని మోదీ మన్ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి., జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, మండల అధ్యక్షులు రమేష్ యాదవ్, బైరెడ్డి వెంకట రమణారెడ్డి, పుప్పాల రఘు, నరసింహ రాజు, టంగుటూరి రాజ్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

