కలం, కరీంనగర్ బ్యూరో: సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని కాళ్లపై నిలబడదామనుకున్న జిల్లా నిరుద్యోగ యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న జాప్యం శాపంగా మారుతోంది. ‘రాజీవ్ యువ వికాసం’ (Rajiv Yuva Vikasam Scheme) పథకం కింద దరఖాస్తులు స్వీకరించి దాదాపు ఏడాదిన్నర కాలం దాటుతున్నాకరీంనగర్ జిల్లాలో నేటికీ ఒక్కరంటే ఒక్కరికీ యూనిట్ మంజూరు కాకపోవడం గమనార్హం.
తాజాగా నవంబరు 19 నుంచి అర్హులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికార యంత్రాంగంలో చలనం, నిరుద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లు, అర్హుల ఎంపికలో చోటుచేసుకునే రాజకీయ జోక్యం నిజమైన లబ్ధిదారులకు ఎక్కడ అన్యాయం చేస్తుందోనని నిరుద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రికార్డు స్థాయిలో వినతులు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
గత ఏడాది ఏప్రిల్ సమయంలో వివిధ సంక్షేమ కార్పొరేషన్ల (ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ) వారీగా ప్రకటన వెలువడగానే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్న యువత పోటీపడి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని 16 మండలాలు, మున్సిపాలిటీల నుంచి ఏకంగా 57,763 మంది అభ్యర్థులు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే 15,000 పైగా దరఖాస్తులు రావడం ఇక్కడి నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
శాఖల వారీగా ఎస్సీ కార్పొరేషన్‌కు 12,000 పైగా, బీసీ, ఈబీసీ, మైనార్టీ, ఎంబీసీ శాఖలకు కలిపి 35,000 కి పైగా వినతులు అందాయి. ఇదిలా ఉంటే దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవడం, తాజాగా నవంబరు 19 డెడ్‌లైన్ వార్తలు రావడంతో యువత తమ దరఖాస్తులు ఏమయ్యాయో తెలుసుకునేందుకు మండల పరిషత్, మున్సిపల్, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.
‘పరిశీలన’ సవాలు.. దరఖాస్తుదారుల్లో కొత్త భయాలు
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం నవంబరు నాటికి అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు దరఖాస్తుదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. మొదటి విడతగా రూ. 50 వేలు (100 శాతం రాయితీ), రూ. లక్ష (90 శాతం రాయితీ) లోపు ఉన్న చిన్న మొత్తాల యూనిట్లను మాత్రమే వడపోసి ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. దాంతో డెయిరీ, కార్లు, వాణిజ్య సముదాయాలు, పెద్ద వ్యాపారాల కోసం రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు కోరిన వేలాది మందికి ఈ విడతలో నిరాశే మిగలనుంది.
పైరవీల క్యూ.. అర్హులకు దక్కేనా?
నవంబరు 19 గడువు దగ్గరపడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ‘పైరవీల పర్వం’ శరవేగంగా అందుకుంది. యూనిట్లు తమకే దక్కేలా చూసి జాబితాలో పేరు చేర్పించాలంటూ దరఖాస్తుదారులు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల ఇళ్ల బాట పట్టారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అర్హులను పక్కనబెట్టి, నాయకుల అనుచరులకు, కార్యకర్తలకు మంజూరు చేస్తే నిజమైన పేద, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విమర్శలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
అధికారులకు కత్తిమీద సాము.. క్షేత్రస్థాయి విశ్లేషణ
వేలాదిగా వచ్చిన దరఖాస్తులను తక్కువ సమయంలో పరిశీలించి అర్హులను తేల్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ, వార్డు కార్యదర్శులు విచారణ చేయాల్సి ఉండగా వారిపై స్థానిక నాయకుల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఐదేళ్ల క్రితం రుణాలు పొందిన వారిని, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు దరఖాస్తు చేసిన వారిని వేరు చేయడం సాంకేతికంగా జాప్యానికి కారణమవుతోంది.
ఇదిలా ఉంటే నవంబరు 19 నుంచి సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ కార్పొరేషన్ల వారీగా నిధుల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలపై స్పష్టమైన జీవో రావాల్సి ఉందని, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే నిబంధనల ప్రకారం, పారదర్శకంగా పరిశీలన పూర్తి చేసి అర్హులకు న్యాయం చేస్తామంటూ జిల్లాకు సంబంధించిన ఆయా సంక్షేమ శాఖ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
మరో వైపు “గతంలో రుణాలు పొంది దుర్వినియోగం చేసిన వారికి కాకుండా రూపాయి ఆసరా లేక స్వయం ఉపాధి కోసం తపిస్తున్న కొత్త నిరుద్యోగులకే ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామసభలు లేదా వార్డు సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రమేయం లేకుంటేనే ‘రాజీవ్ యువ వికాసం’ ఆశయం నెరవేరుతుంది.” అంటూ నిరుద్యోగులు కోరుతున్నారు.

