కలం, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో సోషల్ మీడియా వారియర్స్ కీలక పాత్ర పోషించాలని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి (Shivasena Reddy) అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి వాస్తవాలు, గణాంకాలతో సమాధానం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కేసులు, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఆదివారం వనపర్తి (Wanaparthy) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో (Congress Meeting) ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రచారానికి సోషల్ మీడియా అస్త్రం
పేదలు, రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సోషల్ మీడియా కార్యకర్తలపై ఉందన్నారు. ప్రస్తుతం యువతలో సోషల్ మీడియా ప్రధాన సమాచార వేదికగా మారిందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సులభమైన భాషలో ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలకు సమాధానమిచ్చే సమయంలో కులం, మతం వంటి అంశాలకు తావివ్వకుండా అంశాల ఆధారంగా వాస్తవాలు, గణాంకాలతో స్పందించాలని చెప్పారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా కేవలం ప్రచార వేదిక మాత్రమే కాకుండా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేసే మాధ్యమమని అన్నారు. గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ధనలక్ష్మి, అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, బి.కృష్ణ, మండలాధ్యక్షులు సుఖేందర్‌రెడ్డి, నక్క రవికిరణ్, నరహరి, రామ్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, సుల్తాన్భాషా, వివిధ మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

