మహబూబ్‌నగర్ కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రగడ

కలం, మహబూబ్​నగర్ బ్యూరో : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో డీసీసీ అధ్యక్షుడు ఫొటో గాయబ్ కావడంతో మరోసారి కాంగ్రెస్‌లోని (Mahabubnagar Congress) అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని గ్రీన్‌బెల్ట్ కాలనీలో ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన సమయంలో.. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనిపించడంతో డీసీసీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫ్లెక్సీలను చించివేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరు కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ ఎమ్మెల్యేలుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, ఫ్లెక్సీల రగడ తీవ్ర రూపం దాల్చాయి. జిల్లా కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరే ఈ వివాదానికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

డీసీసీ వర్సెస్ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఎ. సంజీవ్ ముదిరాజ్ నియమితులైనప్పటి నుంచి స్థానిక మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి, ఆయనకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ అధికారిక కార్యక్రమాలు, నియోజకవర్గాలవ్యాప్తంగా జరిగే ప్రభుత్వ, పార్టీ సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదనే అసంతృప్తి ఇరు వర్గాల్లో నెలకొంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ వివాదాన్ని రోడ్డున పడేసింది. డీసీసీ అధ్యక్షుడి వర్గం ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యేల ఫొటోలు కనిపించకపోవడం లేదా ఎమ్మెల్యేల అనుచరులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడికి చోటు దక్కకపోవడం నిత్యకృత్యమైంది. ఒక వర్గం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం వారు తొలగించడం లేదా వాటిపై పరస్పరం దాడులు చేసుకోవడం లాంటి సంఘటనలతో మహబూబ్‌నగర్ రాజకీయం వేడెక్కింది.

గ్రూపులుగా విడిపోయిన కేడర్

ఈ ఆధిపత్య పోరు కేవలం ఇద్దరు నేతల మధ్యే కాకుండా.. నియోజకవర్గ స్థాయిలోని కార్యకర్తలను కూడా రెండు వర్గాలుగా చీల్చిందని సొంత పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యుడిగా తమ నాయకుడికే సర్వాధికారాలు ఉండాలని, పార్టీ కేడర్ అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడవాలని ఎమ్మెల్యే వర్గీయుల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవస్థలో డీసీసీ అధ్యక్షుడి పదవి అత్యున్నతమైనదని, పార్టీ కమిటీల నియామకం, జిల్లా వ్యాప్త నిర్ణయాల్లో డీసీసీదే తుది నిర్ణయం కావాలని డీసీసీ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఇలాంటి తీవ్రమైన అంతర్గత విభేదాలు భగ్గుమనడం టీపీసీసీకి ఇబ్బందికరంగా మారిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయాల్సిన సమయంలో ఇలా ఫ్లెక్సీల రగడతో విభేదాలు వీధిన పడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతోకాలంగా రెండు వర్గాల మధ్య దూరం పెరిగిపోయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు వర్గాలు గాంధీభవన్ వేదికగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే పనిలో పడ్డాయి. టీపీసీసీ నాయకత్వం రంగంలోకి దిగి ఈ ఇద్దరు కీలక నేతలను సమన్వయ పరచకపోతే.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>