కలం, ఆదిలాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ అగ్రగామి నేత స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji)ఆశయాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు ఆనుకుని ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి, చిత్రపటానికి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, పద్మశాలి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Rajarshi Shah) మాట్లాడుతూ… తెలంగాణ ఆత్మగౌరవం, బడుగు, బలహీన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు.
పదవులు, అధికారాల కంటే ప్రజల హక్కులకే పెద్దపీట వేస్తూ ఆయన సాగించిన నిస్వార్థ ప్రజాసేవ, విలువలతో కూడిన రాజకీయ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా బిసి అభివృద్ధి శాఖ అధికారి సోనియా, బిసి, పద్మశాలి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

