కలం, జగిత్యాల: అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో (Metpalli CDPO) దరోజు పద్మను కరీంనగర్ ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు సీడీపీవో పద్మ లంచం డిమాండ్ చేశారు. ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 ఇవ్వాలని, 21 కేంద్రాలకు కలిపి మొత్తం రూ.63,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ ఏసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. శనివారం సీడీపీవో కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి రూ.63,000 లంచం సొమ్ము స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి పద్మను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పద్మను కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

