కలం, మెదక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులాల వారీగా వివరాలు సేకరించేలా ప్రత్యేక అవకాశం కల్పించాలని, ఈ డిమాండ్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన సమాజంలో ఏ వర్గం జనాభా ఎంతుందో స్పష్టమైన గణాంకాలు లేవని, శాస్త్రీయంగా జనాభా వాటాను తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా కుల జనాభా లెక్కలు సేకరించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కుల గణన చేపట్టినప్పటికీ, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి , న్యాయపరమైన చిక్కుల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రామాణికమైన కుల గణన ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం సాధించే వరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తామని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

