కలం, నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య (Nari Ilaiah) డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని (Nalgonda) దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధి కల్పించడంతో పాటు రోజువారీ కూలీని రూ.700కు పెంచాలని కోరారు. ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో చట్టబద్ధమైన నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. కేవలం చట్టం పేరు మార్చడం వల్ల పేదల సమస్యలు పరిష్కారం కావని, కరువు ప్రాంతాల్లో ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ అమలు చేయాలని అన్నారు.
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు గణనీయంగా తగ్గిపోయాయని ఐలయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న 100 లేదా 125 రోజుల ఉపాధి పని ఏ కుటుంబానికీ సరిపోవడం లేదన్నారు. ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ కూలీలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, అక్కడ కూడా స్థిరమైన పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కత్తుల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బోజ్జ చిన్న వెంకులు, గండమల్ల రాములు, రెమిడాల పరశురాములు, పెంటమల్ల సుకన్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

