కలం, మహబూబ్ నగర్ బ్యూరో : విద్యార్థుల సమస్యల కోసం అలుపెరుగని పోరాటం ఏఐఎస్ఎఫ్ (AISF) లక్ష్యమని మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లాలో నిర్వహించనున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 90వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు. నాడు స్వాతంత్రం కోసం బ్రిటిష్ ముష్కరులను తరిమి కొట్టడంలో ఏఐఎస్ఎఫ్ (AISF) క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులపై ఫీజుల భారం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత వంటి సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడంతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఏఐఎస్ఎఫ్ తన ఉద్యమాలను కొనసాగిస్తుందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచే విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహిస్తూ వస్తోందని, తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకమంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్యమించడమే లక్ష్యంగా ఏఐఎస్ఎఫ్ పనిచేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సమస్యలపై మరింత ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హనుమకొండలో జరిగే 90వ రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ సమస్యలు, విద్యార్థుల హక్కులు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు పవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

