తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు.. అధిష్టానం కొత్త కూర్పు ఇదే!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అధిష్టానం కీలక సంస్థాగత మార్పులు చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ తివారీని మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసింది. ఆయన స్థానంలో మధుకర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నియమించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌ను అధిష్టానం అనూహ్య నిర్ణయంతో నియమించడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

తాజా పరిణామాలపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ నర్సంపేటకు చెందిన మధుకర్​కు హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్టీ సంస్థాగత వ్యవహారాలను అధిష్టానం అప్పగించింది. మరోవైపు కర్ణాటకు చెందిన దశరథ్‌కు తెలంగాణ సంస్థాగత బాధ్యతలు అప్పగించడంతో పాటు వరంగల్‌ను ఆయన కార్యాచరణ కేంద్రంగా నిర్ణయించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

తొలిసారి వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం

దశరథ్‌ను వరంగల్ కేంద్రంగా నియమించడం వెనుక బీజేపీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణలో గ్రేటర్ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత కార్యకలాపాలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, ఉత్తర తెలంగాణలోనూ పార్టీ కేడర్‌ను మరింత బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో బీజేపీకి సంస్థాగతంగా మరింత బలం పెంచడం ఈ మార్పుల్లో ఒక అంశమా అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా దశరథ్‌ను వరంగల్‌ కేంద్రంగా కేటాయించడం ఈ చర్చకు బలాన్నిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్

తెలంగాణలో పార్టీ (Telangana BJP) సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం వెనుక రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కేడర్ ను సిద్ధం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే సునీల్ బన్సల్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తూ, అభయ్ పాటిల్, రేఖా శర్మను కో ఇన్‌చార్జ్‌లుగా అధిష్టానం నియమించింది.

దీంతో రాష్ట్రంలో సంస్థాగత వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చినట్లంది. ఏదేమైనా మధుకర్‌కు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతలు, దశరథ్‌కు వరంగల్ కేంద్రంగా తెలంగాణ సంస్థాగత బాధ్యతలు ఇవ్వడం బీజేపీ రాష్ట్రంలో సంస్థాగత విస్తరణపై దృష్టి పెడుతున్న సంకేతంగా కనిపిస్తోంది. అయితే గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమా? అనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>