కలం, ఖమ్మం బ్యూరో: భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల ధాటికి లింగాల గ్రామానికి (Lingala Village) చెందిన కావ్వాల శ్రీకాంత్ పూరి గుడిసె శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయి నేలమట్టమైంది. కంటిముందే ఇల్లు నేలకూలడంతో ఆ పేద కుటుంబం తలదాచుకోవడానికి దిక్కులేక రోడ్డున పడింది.
ఇంట్లోని నిత్యావసరాలు, దుస్తులు, గృహోపకరణాలు పూర్తిగా పాడైపోవడంతో సర్వస్వం కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తలదాచుకునేందుకు నివాసం లేక, ఉన్న సామగ్రి అంతా వరద పాలవ్వడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు జరిగిన నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఆర్థిక సాయంతో పాటు పక్కా నివాస వసతి కల్పించి ఆదుకోవాలని శ్రీకాంత్ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

