జగిత్యాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా

కలం, జగిత్యాల: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు (Chintakunta Lake) వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar), మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం భక్తిశ్రద్ధల నడుమ గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700కు పైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో సేవలందించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి వార్డుకు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ చింతకుంట చెరువు వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి భవిష్యత్‌లో మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కో-ఆప్షన్ సభ్యులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>