కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడంతో పాటు రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్, రోడ్డు , రైల్వే భద్రత విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ప్రత్యేకంగా ‘ట్రాఫిక్, రోడ్, రైల్ సేఫ్టీ బ్యూరో’ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ప్రత్యేక విభాగానికి ‘టీజీ టీఎంఏఆర్ఎస్’ (TG TMARS) గా నామకరణం చేసింది. దీనికి అధిపతిగా అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారిని డైరెక్టర్‌గా నియమించనున్నారు.
ఈ నూతన బ్యూరో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా, ఎన్ఫోర్స్మెంట్ను మరింత కఠినతరం చేయనున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లపై ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించనున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాస్త్రీయ విధానంలో లోతైన దర్యాప్తు చేపట్టి నివేదికలు తయారు చేస్తారు.
దీనితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన విజిలెన్స్ నిఘా ఏర్పాటు కానుంది. ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ప్రణాళికాబద్ధమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ ట్రాఫిక్ రంగాన్ని పర్యవేక్షించడానికి అదనపు ఎస్పీ స్థాయి ప్రత్యేక పోస్టును కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ విభాగానికి చెందిన 300 పోస్టులను నేరుగా ఈ కొత్త బ్యూరోకు బదిలీ చేస్తున్నారు. విధుల్లో పారదర్శకతను పెంచేందుకు సిబ్బందికి అధునాతన బాడీ వోర్న్ కెమెరాలను కేటాయించనున్నారు. వీటితో పాటు సిబ్బందికి అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెళకువలు అందించేందుకు ప్రత్యేకంగా ‘రాష్ట్ర ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ’ ని కూడా ప్రారంభించబోతున్నారు.

