కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు (Ganesh Immersion) ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) తెలిపారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు సహకరించిన నగర ప్రజలు, పాలకవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులు, మండపాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన గణేష్ నిమజ్జన వేడుకలు గురువారం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట తదితర ప్రధాన నిమజ్జన పాయింట్లను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులను అడిగి నిమజ్జన ప్రక్రియ వివరాలను తెలుసుకుని, ఎలాంటి అంతరాయం లేకుండా తగిన సూచనలు చేశారు.
నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 2,252 గణపతి విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఐదు అడుగులకు పైబడిన విగ్రహాల నిమజ్జన వివరాల ప్రకారం చింతకుంటలో 740, మానకొండూర్లో 850, కొత్తపల్లిలో 550, బొమ్మకల్లో 62, గోపాల్పూర్లో 30, దుర్షేడ్లో 20 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జన మహోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు.
నగరంతో పాటు నిమజ్జన పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికులు మెరుగైన పరిశుభ్రత చర్యలు చేపట్టారని తెలిపారు. భక్తులు, మండపాల నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నిమజ్జన పాయింట్ల వద్ద పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నగరపాలక సంస్థ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

