అగ్నిప్రమాద ఘటనపై రిమ్స్‌లో భద్రతా సమీక్ష.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రిలో ఇటీవల నవజాత శిశువుల వార్డులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు, నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు స్థానికంగానే అందేలా రిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

గురువారం చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులతో కలిసి రిమ్స్‌ను సందర్శించిన కలెక్టర్, క్రిటికల్ కేర్ వార్డు, పీడియాట్రిక్స్ విభాగం, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డుతో పాటు పలు విభాగాలను పరిశీలించారు. ఎయిమ్స్ వైద్యులతో కలిసి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, సిబ్బంది పనితీరు, అత్యవసర వైద్య సదుపాయాలను సమీక్షించారు.

రిమ్స్ పీడియాట్రిక్స్ విభాగంలో నవజాత శిశువుల కోసం ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. తల్లులు, చిన్నారుల సౌకర్యార్థం మదర్ బెడ్స్‌తో పాటు ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ లైనింగ్, బేబీ వార్మర్లు, సీపీఏపీ సపోర్ట్, వెంటిలేటర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌క్యుబేటర్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొత్తం 34 బెడ్లను ఏర్పాటు చేయగా, 23 బెడ్లకు డైరెక్ట్ ఆక్సిజన్ సదుపాయం, 11 బెడ్లకు సీపీఏపీ సపోర్ట్ అందుబాటులో ఉందన్నారు. మాతా శిశు వైద్య నిపుణులు, పీడియాట్రిషియన్లు, ప్రత్యేక శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు నిరంతరం అందుబాటులో ఉంటూ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.

రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించి, లోపాలను గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీడబ్ల్యూఓ మిల్కా, బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, వైద్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>