కలం, వెబ్ డెస్క్: కుప్పం పట్టణం స్వర్ణ కుప్పంగా మారుతోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లను నీళ్లతో నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని తెలిపారు. గతంలో తాను చేసిన పనులు ఆగిపోయాయని.. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.
కుప్పంలో భారీ ప్రాజెక్టులను శంకుస్థాపనలు చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే రూ.2 కోట్లతో రైతు బజార్ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.రూ. 45 కోట్లతో బీరుగానిపల్లె దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు కుప్పంలో రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం భూమి పూజ చేశారు. అలాగే కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, మెటిరీయల్ రికవరీ సెంటర్ ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూర్ జూనియర్ కాలేజి పనులకు భూమిపూజ చేశారు. అంతకముందు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.

