కలం, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే సాగు, తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు రానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో.. వచ్చే నెల నాటికి ‘సూపర్ ఎల్ నినో’గా మారనున్నది. అది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనున్నది. వచ్చే ఏడాది సమ్మర్, ప్రీ-మాన్సూన్ హీట్ వేవ్ కలిసే ఉంటాయని.. సాధారణంతో పోలిస్తే పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని.. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)తో పాటు భారత్‌లోని 188 మంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గత ఏడున్నర దశాబ్దాలలో 23 సార్లు ఎల్ నినో పరిస్థితి ఇండియాలో వచ్చిందని, అందులో 11 సార్లు మాత్రమే నీటి కొరతతో కరువు లాంటి పరిస్థితి తలెత్తిందని, ఈసారి చాలా తీవ్రమైన పరిస్థితే ఉంటుందని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ ప్రభావం వ్యవసాయంతో పాటు అనేక రంగాలపై పడి, చివరకు ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుందని డబ్ల్యూఎంవో పేర్కొన్నది. ప్రభుత్వాలు మేల్కొని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు సూచించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ఎల్ నినో ఎఫెక్ట్ (Super El Nino)తో ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెనాళ్ల ద్వారా పొలాలకు నీళ్లు విడుదల చేయడం లేదు. కేవలం తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఖరీఫ్ వ్యవసాయం సాధారణం కంటే తగ్గడంతో నవంబర్ చివరి నాటికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపుతుందని, రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ఎల్ నినో కారణంగా వ్యవసాయ అవసరాలకు 24 గంటల కరెంట్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీలైనంత వరకు అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలి వేదికగా పేర్కొన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయిందని, కేవలం థర్మల్ కరెంట్‌తోనే నెట్టుకురావాల్సి వస్తున్నదని.. దీనికి తోడు వాతావరణం వేడెక్కడంతో సమ్మర్ తరహాలో వినియోగం గరిష్ట స్థాయికి చేరుకున్నదని తెలిపారు.
పడిపోయిన సగటు వర్షపాతం..
ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం దాదాపు లేకుండా పోయిందని, కేవలం అల్పపీడనం కారణంగా అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం రెండు నెలల క్రితమే స్పష్టం చేసింది. ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల రూపొందించిన నివేదికలో ఆగస్టు నెలలో భారత్‌లో సగటున 16% వర్షపాతం తగ్గినట్లు పేర్కొన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల వానలే దాదాపు లేవని వివరించింది.
రానున్న రోజుల్లో ఎల్ నినో పరిస్థితి మరింత తీవ్రమై ‘సూపర్ ఎల్ నినో’గా మారనున్నందున సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. ఈ మార్పులు వచ్చే ఏడాది వరకూ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి ఎల్ నినో పరిధి పెద్దగానే ఉండబోతున్నదని వెల్లడించింది. గత 50 ఏండ్లలో వచ్చిన ఎల్ నినోలతో పోలిస్తే ఈసారి తీవ్రమైనదేనని చెప్పింది. రాబోయే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ‘స్కై మెట్’ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ తెలిపారు. ఈశాన్య రుతుపవనాలను కూడా ఎల్ నినో ప్రభావితం చేయవచ్చన్నారు. ఈసారి శీతాకాలం కూడా ‘వెచ్చగా’ ఉంటుందని పేర్కొన్నారు.
రబీపై ఆశల్లేవ్..
సూపర్ ఎల్ నినో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుండడం.. ఆ తర్వాత వచ్చే సమ్మర్ వేడి, దాని వెన్నంటే వచ్చే నైరుతి రుతుపవనాలపై నెగెటివ్ ప్రభావంతో దాదాపు సంవత్సరం వరకు ఇదే పరిస్థితి వెంటాడనున్నది. దీంతో వచ్చే సమ్మర్లో వడగాలులు మరింత తీవ్రం కానున్నాయి. ఆగస్టులో 16% లోటు వర్షపాతం ప్రభావం సెప్టెంబర్‌లోనూ కంటిన్యూ అయ్యి ఖరీఫ్‌పై మరింత ప్రతికూల ప్రభావం చూపనున్నది. పంటల దిగుబడులు, గ్రామీణ రాబడిని దెబ్బతీసే ప్రమాదముంది. రబీ సాగు సైతం ఈసారి ప్రశ్నార్థకమే. ఖరీఫ్‌లో డీలాపడిన రైతులకు రబీ మీద పెద్దగా ఆశల్లేవ్.
మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో 40% వర్షపాత లోటుతో పరిస్థితి దారుణంగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు. అందుకే ఖరీఫ్ పప్పుధాన్యాల దిగుబడి సగానికి పైగా తగ్గిందని ‘కరెంట్ సైన్స్’ స్టడీలో తేలింది. ఎల్ నినో ముప్పుతో ఆహార భద్రత కూడా ప్రభావితం కానున్నందున ప్రభుత్వాలు తక్షణమే కరువు నిరోధక చర్యలు చేపట్టాలని, రైతులకు పంట సలహాలు ఇవ్వాలని, ముందస్తు సహాయక చర్యలు అందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సూచించారు.

