వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి : పీవైఎల్

​కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వాసుపత్రుల్లో మందులు దొరక్క, డాక్టర్లు అందుబాటులో లేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పేద గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వర్షాల కారణంగా విషజ్వరాలు వ్యాపించి ఆదివాసీలు మంచాలకే పరిమితమవుతుంటే, ప్రభుత్వం పంపుతున్న కోట్ల రూపాయల మందులు పక్కదారి పడుతున్నాయి. మరోవైపు భద్రాచలం (Bhadrachalam) ఏరియా ఆసుపత్రిలోని కొంతమంది డాక్టర్లు తమ సొంత ప్రైవేట్ క్లినిక్‌లలో విలాసంగా కాలం గడుపుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు గంట, రెండు గంటలు మాత్రమే వచ్చి వెళ్తున్నారంటూ, శనివారం ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి మాట్లాడుతూ… ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మందుల గల్లంతుపై తక్షణమే విచారణ జరిపించి, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

అలాగే ఇంటీరియర్ గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల పనితీరుపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లిక్కి నరేష్, రాజేష్, బత్తుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>