కలం, నారాయణపేట: గణేష్ శోభాయాత్రలు, నిమజ్జనాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ (SP Vineeth) హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని SR గార్డెన్‌లో గణేష్ ఉత్సవ సమితి, గణేష్ మండపాల నిర్వాహకులు, ఆర్గనైజర్లు, హిందూ మత పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శోభాయాత్రలు, నిమజ్జనం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదొక విష సంస్కృతి..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బందిని మోహరించి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు నిఘా పెడుతామని ఎస్పీ వినీత్ తెలిపారు. శోభాయాత్రల్లో డీజేలు పెట్టడమనేది విష సంస్కృతి అని స్పష్టం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం కాదని, మన సాంప్రదాయ పద్ధతుల్లో భక్తి, సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా శోభాయాత్రలు నిర్వహించి.. జిల్లా సాంస్కృతిక వైభవాన్ని కాపాడాలని సూచించారు. అదనపు ఎస్పీ ఎండీ. రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, భాగ్య రెడ్డి పాల్గొన్నారు.

