కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా జోగిపేట (Jogipet) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలోని రేకుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలు సామగ్రి అగ్నికి ఆహుతయినట్లు తెలుస్తోంది. గోదాంలో నిల్వ ఉంచిన రైతుల వ్యవసాయ సబ్సిడీ పరికరాలు మంటల్లో కాలిపోయాయి.
అలాగే రైతులకు సంబంధించిన అప్లికేషన్ పత్రాలు, కార్యాలయ ఫర్నీచర్ కూడా దగ్ధమైనట్లు సమాచారం. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నాలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

