సీఎం రేవంత్ ఇలాకాలో కవిత పాంచజన్య శంఖారావం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పాంచజన్య శంఖారావం పూరించనున్నారు. కొడంగల్ నియోజవకర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో భారీ సభా వేదిక ఏర్పాటు చేశారు. వంద మందికి పైగా ముఖ్య నాయకులు సభ వేదిక మీద కూర్చోనున్నారు. సభా ప్రాంగణంలో 10 వేల మంది ప్రజలు కూర్చొనేలా సీటింగ్ ఏర్పాటు చేశారు.

మొదటిసారి కొడంగల్ నియోజకవర్గానికి..

తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారి కల్వకుంట్ల కవిత కొడంగల్ వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్ నుంచి కోస్గి కాలేజీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కోస్గి పట్టణంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత కవిత నేరుగా కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద కల్వకుంట్ల కవితకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ర్యాలీగా మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, పరిగి మీదుగా కవిత కొడంగల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే గడ సింగాపూర్‌కు చేరుకుంటారు. అక్కడ మరోసారి స్వాగత కార్యక్రమం ఉంటుంది. అనంతరం కొడంగల్ చేరుకుని.. అక్కడి నుంచి ర్యాలీగా కోస్గి చేరుకుంటారు.

కోస్గి సభ నుంచే..

రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి పాలమూరు జిల్లాకు వస్తున్నారు. మే 8న షాద్ నగర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ నిర్వహించారు. ఆదివారం నిర్వహించే కోస్గి సభ వేదికపై నుంచి బహుజన తెలంగాణ సాధన కోసం తాను తీసుకోబోయే నిర్ణయాలను ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించుకునేందుకు స్వీయ రాజకీయ శక్తి ఎందుకు అవసరమో కవిత వివరించనున్నారు. తెలంగాణ మదర్ బోర్డుగా పని చేసే తమ పార్టీని ఆదరించాలని కోస్గి వేదిక మీది నుంచి ప్రజలను అభ్యర్థించబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>