కలం, నారాయణపేట: నారాయణ పేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్ (Dhanwada Model School), కాలేజ్ బాలికల హాస్టల్‌లో శనివారం ఉదయం ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కలెక్టర్ ప్రియాంక తక్షణమే స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆర్డీవో రమేష్, తహసీల్దార్ సింధూజ, మండల ప్రత్యేక అధికారి సాల్మన్ అక్కడకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.
అత్యవసర వైద్య సహాయం కోసం కొందరు విద్యార్థినులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాల వంట ఏజెన్సీని తక్షణమే రద్దు చేయడంతో పాటు కేర్ టేకర్, వార్డెన్‌ను తొలగించాలని ఆదేశించారు.

