కరెంట్ కోతలు.. నీరు లేక ఎండుతున్న పంటలు!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌ నగర్ (Mahabubnagar) జిల్లాలో రైతులు ఒక వైపు కరెంట్ కష్టాలు, మరోవైపు సాగు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, మహబూబ్‌నగర్ సరిహద్దు జిల్లాల్లో రైతులు సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామంలో లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోయి, పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్డుపై బైఠాయించారు. రాత్రి పూట ఇవ్వాల్సిన కరెంట్ అర్ధరాత్రి ఇస్తున్నారని మండిపడుతున్నారు. వికారాబాద్, పరిగి-మహబూబ్‌నగర్ రహదారిపై దోమ మండలం మోత్కూర్ గేట్ వద్ద రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వనపర్తి జిల్లా నాచహల్లి, పెద్దగూడెం ప్రాంతాల్లో అప్రకటిత కోతలను నిరసిస్తూ రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడించారు.

చివరికి చేరని సాగు నీరు..

నాగర్‌ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాగు నీటి కోసం అన్నదాతల బాధ వర్ణనాతీతంగా మారింది. నాగర్‌ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాలువల్లో నీరు పారకపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. డి -26 ప్రధాన కాలువ పరిధిలో చివరి భూములకు నీరు అందడం లేదు. తాడూరు మండలం గుంటకోడూరు వంటి గ్రామాల్లో రైతులు సాగు నీటి కోసం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు.

సుమారు 3 వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్క జొన్న పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గద్వాల జిల్లా పక్కనే కృష్ణా నది పారుతున్నా సాగు నీటి కష్టాలు తప్పలేదు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా సగం వరకే విత్తనాలు చల్లారు. అయినా వర్షాలు లేక ఎదుగుదల లేక పంటలన్నీ గిడసబారిపోయాయి. బోర్ల కింద నాట్లు వేసుకున్న రైతులు కరెంట్ కోతలతో పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>