కలం, ఆదిలాబాద్: లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యమని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 200 మంది అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోచింగ్ (Free Police Coaching) కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుళ్లను కలెక్టర్ సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే అధికారుల సమన్వయంతో మెరిట్ ప్రాతిపదికన 200 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. శిక్షణ కోసం మొత్తం 465 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా 200 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
శిక్షణ పొందుతున్న అభ్యర్థులు భయాన్ని వీడి లక్ష్య సాధనపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. అర్హత, ప్రతిభ ఆధారంగానే శిక్షణకు ఎంపికయ్యారని, స్టడీ సర్కిళ్లలో డిజిటల్ బోర్డులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అవసరమైన ఫర్నిచర్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. 60 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. సందేహాలను ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవడంతో పాటు రోజువారీ, వారాంతపు, గ్రాండ్ టెస్టులకు హాజరుకావాలని తెలిపారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను ఐఐటీ కాన్పూర్‌లో చదువుకునే రోజుల్లో సీనియర్ అధికారుల మార్గదర్శనం పొందిన విషయాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు భవిష్యత్తులో పోలీస్ యూనిఫామ్ ధరించి విజేతలుగా నిలిచి, భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీతకుమారి, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు రమేష్, ప్రవీణ్‌కుమార్, ఫ్యాకల్టీ రమణ, మోటివేటర్ సల్ల విజయబాబు, స్టడీ సర్కిల్ సిబ్బంది, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

