హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు : జీవన్ రెడ్డి

కలం, జగిత్యాల : రాష్ట్రంలో పాలన చేతగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దావ వసంత సురేష్ తో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు చెంపపెట్టని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని ఆయన (Jeevan Reddy) డిమాండ్ చేశారు.

ఎన్డీఎస్ఏ అనుమతించినా నీళ్లివ్వడం లేదు :

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడితే, రైతులను ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల పంప్ హౌస్‌లను ఉపయోగించుకోవచ్చని ఎన్డీఎస్ఏ పేర్కొన్నప్పటికీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భేషజాలతో పంపులు ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని నాలుగింతలు చేసి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విద్యుత్ కూడా ఇవ్వలేకపోతోందని నిలదీశారు.

కేసీఆర్‌పై బురదజల్లే కుట్రలు :

కేసీఆర్‌కు ఫామ్‌హౌస్ వద్ద కేవలం 67 ఎకరాల భూమి మాత్రమే ఉందని అసెంబ్లీ సాక్షిగా తేలినప్పటికీ, వెయ్యి ఎకరాలు, కబ్జాలంటూ రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ కుటుంబానికే వందల ఎకరాల భూములు ఉన్నాయని, ఆస్తులపై కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. “నేను రైతును కాను.. భూముల బేరగాడిని” అని స్వయంగా చెప్పుకున్న రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

సమావేశంలో దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధిస్తే, ఆయనపై రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, పాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>