కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు తనపై అనర్హత వేటు వేయడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తమ వాదనలు వినాలని బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, దానం నాగేందర్ ఎమ్మెల్యే అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయన (Danam Nagender) ఎంపీగా పోటీ చేసిన 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. స్పీకర్ ఆదేశాలపై స్టే విధించిన హై కోర్టు.. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ బీ–ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానంపై అనర్హత వేటు వేయడంలో ఇదే బలమైన ఆధారంగా నిలిచింది. అయితే, అనర్హతపై తాను సుప్రీం కోర్టుకు వెళ్లను అని చెప్పిన దానం నాగేందర్ ఇప్పుడు మళ్లీ యూ టర్న్ తీసుకుని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

